Tuesday, October 1, 2019

నేను జీవించుటలో మరణమే లేదని విశ్వ భావన తెలుపుతున్నది

నేను జీవించుటలో మరణమే లేదని విశ్వ భావన తెలుపుతున్నది
నేను ఉదయించుటలో అస్తమయమే లేదని విశ్వ తత్వన తెలుపుతున్నది

నేనుగా అవతరించుటలో అంతరించుట లేదని దివ్యత్వమే తెలుపుతున్నది
నేనుగా ఉద్భవించుటలో అదృశ్యమగుట లేదని స్వభావత్వమే తెలుపుతున్నది  || నేను ||

అంతరాత్మతో జీవించు నా శ్వాస విశ్వాంతరంగమున అనంతమై జీవిస్తున్నది
పరమాత్మతో ధ్యానించు నా ధ్యాస ఆకాశరంగమున ఆనందమై ప్రయాణిస్తున్నది

మహాత్మతో ఉదయించు నా ఉచ్చ్వాస అంతరిక్షమున అద్భుతమై విహరిస్తున్నది 
జీవాత్మతో అంతర్భవించు నా పరధ్యాస అనంతలోకమున ఆశ్చర్యమై వ్యాపిస్తున్నది  || నేను ||

మేధస్సుతో ఆలోచించు నా భావన విశిష్టమై జీవుల దేహాలలో విజృంభిస్తున్నది
మనస్సుతో పరిశోధించు నా తత్వన ప్రఖ్యాతమై జీవుల రూపాలలో ప్రజ్వలిస్తున్నది

వయస్సుతో గమనించు నా వేదన పరిశుద్ధమై జీవుల హృదయాలలో స్పందిస్తున్నది 
ఆయుస్సుతో అన్వేషించు నా జీవన పరిపూర్ణమై జీవుల బంధాలలో అవతరిస్తున్నది  || నేను ||

No comments:

Post a Comment